బషీర్‌బాగ్, వెలుగు : నుమాయిష్ సందర్భంగా మహిళలను వేధిస్తున్న పలువురు ఈవ్ టీజర్స్‌ను హైదరాబాద్ షీ టీమ్స్ పట్టుకున్నాయి. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన 85వ నుమాయిష్‌లో మొత్తం 264 మంది ఆకతాయిలు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినట్లు హైదరాబాద్ విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ డాక్టర్ లావణ్య తెలిపారు.
పట్టుబడ్డ వారిలో 242 మంది మేజర్లు కాగా, 22 మంది మైనర్లు ఉన్నారు. వీరిలో 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అతి దుష్ప్రవర్తనకు పాల్పడిన 56 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. వారిలో 52 మందికి ఒక్కొక్కరికి రూ.1,050 జరిమానా విధించగా, మరో నలుగురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించారు.
పబ్లిక్ ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని డీసీపీ తెలిపారు. ఎగ్జిబిషన్ స్టాళ్లతో పాటు స్కూల్స్, కాలేజీలు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో 385 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. రద్దీ ప్రాంతాల్లో 2,046 అబ్జర్వేషన్ డ్రైవ్‌లు చేపట్టినట్లు వెల్లడించారు.
